హైదరాబాద్‌ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌: నగర ప్రజలందరి చూపూ అయోధ్యవైపే. కానీ ఎలా వెళ్లాలనేదే ఇప్పుడు అందరి ప్రశ్న. 

రామ మందిరం దర్శనానికి అనుమతించడంతో నగరం నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివెళ్లే అవకాశాలున్నాయి. ఇలా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నగరం నుంచి 17 ప్రత్యేక రైళ్లను నడపాలని భారతీయ రైల్వే ఏర్పాట్లు చేసింది. 

రైల్వే బోర్డు ఆదేశాల మేరకు రైల్వేలోని అన్ని జోన్లు అయోధ్యకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాయి. ఈ క్రమంలో దక్షిణమధ్య రైల్వే ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 29 వరకూ మొత్తం 41 ట్రిప్పులు తిప్పుతోంది. ఇందులో సికింద్రాబాద్‌ నుంచి 17 ప్రత్యేక ట్రిప్పులున్నాయి. ఈనెల 29, 31, ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 18, 19, 21, 23, 25, 27, 29 తేదీల్లో ఈ రైళ్లున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లకు తోడు… ప్రతిరోజు సికింద్రాబాద్‌ నుంచి దానాపూర్‌ కు ఒక ఎక్స్‌ప్రెస్‌ రైలు నడుస్తోంది. ఉదయం 9.25 గంటలకు బయలుదేరే ఈ రైలులో టిక్కెట్లు దొరకడం గగనంగా మారింది. 

అందుకే ప్రతి శుక్రవారం నగరం నుంచి గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ రైలు నగరంలో ఉదయం 10.40 గంటలకు బయలుదేరి నేరుగా అయోధ్యకు మరుసటి రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుతుంది.

Leave a Comment