India Postal Jobs: తపాలా శాఖలో 40,889 ఉద్యోగాలు: రేపే ఆఖరు తేది

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 40,889 గ్రామీణ డాక్
సేవక్(జీడీఎస్‌) ఉద్యోగాల(postal jobs)కు దరఖాస్తు ప్రక్రియ తుది దశకు
చేరుకుంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకొనేందుకు ఇంకా ఒక్కరోజే
మిగిలి ఉంది. పదో తరగతి అర్హతపై పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా బ్రాంచ్‌ పోస్టు
మాస్టర్‌, అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌/డాక్‌ సేవక్‌ ఉద్యోగాల
భర్తీకి గత నెల 27 నుంచి తపాలాశాఖ ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానించిన విషయం
తెలిసిందే. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 16 వరకు https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకొనేందుకు అవకాశం ఉంది. 

ఇండియా పోస్ట్‌(India post) విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. ఏపీలో
2480 పోస్టులు ఖాళీలు ఉండగా.. తెలంగాణలో 1266 పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తుల్లో తప్పులను సవరించుకొనేందుకు ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు గడువు
ఇచ్చారు. ఈ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య
ఉండాలి (ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు
గరిష్ఠ వయసులో సడలింపు ఉంది). కంప్యూటర్‌ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌
తొక్కడం కూడా రావాలి. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు
పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు
సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/
డాక్‌ సేవక్‌లకు ప్రోత్సాహకాలు ఉంటాయి. ఆయా సేవల విలువ ప్రకారం
ఇన్సెంటివ్‌ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి
ల్యాప్‌టాప్‌/ కంప్యూటర్‌/ స్మార్ట్‌ ఫోన్‌ లాంటివి తపాలా శాఖ
సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాల్సి ఉంటుంది.

Leave a Comment