Moral Stories: చివరికి గెలిచేది మంచితనం మాత్రమే

పిల్లల ఆలోచనలు | అమ్మ సమాధానములు 

 "అమ్మా! నీ వంట అమృతంలా ఉంటుంది. నీలా ఇంత రుచిగా వండటం ఈ ప్రపంచంలోనే ఎవరి వల్లా సాధ్యం కాదేమో!" అన్నాడు చంద్ర. "అవునమ్మా! మనకే కాదు, మన ఇంటికి వచ్చిన అతిథులంతా నీ వంటే అమృతం అంటారు." అన్నది హిమబిందు. "మీ అమ్మతో పూటకూళ్ళ ఇల్లు పెట్టిస్తే మీ అమ్మ వంట తినే అదృష్టం ఎంతోమందికి కలుగుతుంది. మనం ఎంతో గొప్ప సంపన్నులం అవుతాము." అన్నాడు తిరుమలేశం. "నాకు అలాంటి ఆశలేమీ లేవండీ! అయినా మన ఊరిలో గంగమ్మ పూటకూళ్ళ ఇల్లు ఉందిగా! చుట్టుపక్కల ఎన్నో ఊళ్ళ నుంచి జనం అక్కడకు వస్తారు. అంత ప్రసిద్ధి. పోటీగా వేరే పూటకూళ్ళ ఇల్లు ఎందుకు?" అన్నది కమలమ్మ. 


    గంగమ్మ పూటకూళ్ళ ఇల్లు ఎంతో ప్రసిద్ధి. గంగమ్మ రుచికరమైన వంటలు చేస్తుందని, చుట్టుపక్కల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి బాటసారులు అక్కడికే వచ్చి భోజనమో, అల్పాహారమో తిని వెళ్తారు. రాను రాను ఆ పూటకూళ్ళ ఇంటికి జనం తాకిడి ఎక్కువైంది. మొదట్లో అందరితో ఆప్యాయంగా మాట్లాడిన గంగమ్మ రాను రాను గర్వంతో ప్రవర్తింసాగింది. ఈ ప్రపంచానికి తన పూటకూళ్ళ ఇల్లే దిక్కు అని విర్రవీగింది. ధరలు విపరీతంగా పెంచింది. అయినా జనానికి వేరే దిక్కు లేదు కదా! అక్కడికే వస్తున్నారు. దాంతో మరింతగా ధరలు పెంచి, నిలదీసిన వారితో పరుషంగా మాట్లాడింది గంగమ్మ. జనం విపరీతంగా ఉన్నప్పుడు బాగా తెలిసిన వారికి ముందుగా వడ్డిస్తుంది. మిగతా వారికి ఎంత ముందుగా వచ్చినా సరే, వారిని పట్టించుకోదు. అలా వారిని గంటల తరబడి వేచి ఉండేలా చేస్తుంది. అసహనంతో ఎంతోమంది గంగమ్మతో గొడవపడేవారు కూడా! 


        గంగమ్మ ఇలా ఆలోచించసాగింది. తాను వంట చేస్తేనే ఇంతమంది కడుపు నిండుతుంది. అయినా ఈ జనానికి తన విలువ తెలిసి రావడం లేదు. ఓ ఆరు నెలలు తాను కనిపించకుండా తన చుట్టాల గ్రామానికి వెళితే వీరికి తన విలువ తెలిసి వస్తుంది. వీరి కడుపు మాడుతుంది. అందరికీ తగిన శాస్తి జరుగుతుంది, అని ఆలోచించింది. ఎవ్వరికీ చెప్పకుండా ఆ ఊరి నుంచి వెళ్ళిపోయింది. 


   ‌     అయినా జనానికి ఏమి నష్టం? ఎవరి వంట వారు చేసుకుంటున్నారు. ఈ విషయం కమలమ్మకి తెలిసింది. తన స్వార్థం గురించి కాక జనం ఇబ్బందుల గురించి ఆలోచించింది. తాను పూటకూళ్ళ ఇల్లు పెట్టింది. కమ్మగా వంటలు చేయడంతో పాటు వచ్చిన బాటసారుల యోగక్షేమాలను విచారించి, వారు తింటుంటే వారికి కమ్మని కథలు, కబుర్లు చెప్పింది. వచ్చిన వారికి కమలమ్మ అన్నపూర్ణ అయింది. దాంతో మరింతగా జనం పెరిగిపోయారు. అయితే కొంతమంది "అమ్మా! నీ వంటలు అమృతంలా ఉంటున్నాయి. రహస్యం ఏమిటి?" అని అడిగారు. దాపరికం లేకుండా వారికి ఆ వంటలు చేసే విధానాన్ని నేర్పింది. ఆమె కష్టాన్ని చూడలేక కొంతమంది శ్రేయోభిలాషులు ఆమెకు రోజూ స్వచ్ఛందంగా వంటలో సాయం చేసేవారు. ఆమె మంచితనమే ఆమె శ్రేయోభిలాషులను పెంచింది. ఎంతమంది జనం పెరిగినా కమలకు శ్రమ అనిపించలేదు.


        కమలమ్మ పూటకూళ్ళ ఇంటి గురించి,  ఆమె మంచితనం గురించి ఆ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు విజయసేనునికి తెలిసింది. ఒకరోజు మారువేషంలో అక్కడికి వచ్చి, భోజనం చేశాడు రాజు. అద్భుతం! తాను పుట్టినప్పటి నుంచీ ఇంత రుచికరమైన వంటలు తినలేదు. కమలమ్మకు విలువైన కానుకలను సమర్పించి వెళ్ళాడు. వచ్చిన వ్యక్తి సామాన్యుడు కాదు అని అర్థమైంది కమలమ్మకు. మరునాడు విజయసేనుడు కమలమ్మను తన ఆస్థానానికి పిలిపించాడు. తన ఆస్థానంలో ఉంటూ తనకు, తనవారి అందరికీ రోజూ వంటలు చేయమని అడుగుతాడు. ఇంకేం! రాజాస్థానంలో ఉద్యోగం. ఊహించలేనంత జీతం. 

కమలమ్మ మంచితనం గెలిచింది. అక్కడ ఆ గ్రామంలో కమలమ్మ దగ్గర వంట నేర్చుకున్నవారు ఆ పూటకూళ్ళ ఇంటిని నడుపుతున్నారు. కమలమ్మ లేని లోటు తీరుస్తున్నారు. ఆరు నెలల తర్వాత ఆ గ్రామానికి వచ్చిన గంగమ్మను పట్టించుకునే వారే లేరు. ఆమె కనబడితే ముఖం తిప్పుకుంటున్నారు. వెనుకచాటున కొంతమంది పగలబడి నవ్వారు కూడా! అక్కడి సంగతులు తెలిసి, ఇక తనను ఎవరూ పట్టించుకోరని అర్థమై, తనకే తగిన శాస్తి జరిగిందని గ్రహించి, అవమానంతో అక్కడ నుంచి శాశ్వతంగా మరో గ్రామానికి వెళ్ళిపోయింది గంగమ్మ. కమలమ్మ దగ్గర వంట నేర్చుకున్న చాలామంది అనేక ప్రాంతాలలో పూటకూళ్ళ ఇళ్ళు పెట్టి, ఐశ్వర్యవంతులు అయినారు.

ఔను....... మంచితనం గెలిచింది.


Post a Comment

Comments