Moral Stories: పిసినారి పిచ్చమ్మ

భర్త చనిపోయిన పిచ్చమ్మకు ఊళ్లో దంతె దూలాలతో కట్టిన ఒక పాత ఇల్లు, కొంత పొలం ఆస్తిగా సంక్రమించాయి. వాటికి తోడు నాలుగు బర్రెలు. ఈ ఆస్తితో ఆమె తన ముగ్గురు కూతుళ్లనీ పోషించుకోవాల్సి వచ్చింది.


పిచ్చమ్మకు నోటి దురుసు. దానికి పిసినారితనం తోడయ్యేసరికి ఆమె ఖ్యాతి త్వరగానే విస్తరించింది. ఆమె తనదగ్గరున్న ధాన్యాన్నికూడా వడ్డీలకు తిప్పుతూ, కూతుళ్లు పెద్దవాళ్ళయ్యే సరికి బాగానే డబ్బులు వెనకేసింది. ఎవరైనా బాకీదార్లు సకాలానికి బాకీ చెల్లించకపోతే వారిపై యుద్ధం ప్రకటించి రగడ చేసేది పిచ్చమ్మ.


కాలం గడిచిపోతూ ఉంది. పిచ్చమ్మ ముగ్గురు కూతుళ్ళకూ వివాహం చేసింది. అందరూ బాగానే ఉన్నారు; కానీ చిన్న కూతురుకు మాత్రం ఇల్లు సరిగా జరగని పరిస్థితి. ఆమె భర్త ఒక రోజున భార్యతో "మన ఇల్లు జరగటం కష్టంగా ఉన్నది. మీ అమ్మ బర్రెల్ని బాగానే పెంచుతోంది గద, ఇంకా? పోయి, మనకు ఒక బర్రెనిమ్మని అడగరాదూ?" అన్నాడు.


"నేను వెళ్ళను. మా అమ్మ ఇవ్వదు. నువ్వే వెళ్ళి అడుగు కావాలంటే" అన్నది భార్య. "సరే, చూద్దాం" అని పిచ్చమ్మ అల్లుడు ఒకరోజు పనిగట్టుకొని అత్త దగ్గరికి వెళ్ళి, తమ పరిస్థితిని వివరించి, ఒక బర్రెని ఇమ్మన్నాడు. అత్త ఇరుకున పడింది. ఇవ్వటం ఇష్టం లేదు; అలాగని ఇవ్వకపోతే అల్లుడు నొచ్చుకుంటాడాయె! అందుకని ఆమె తెలివిగా ఒక బక్క చిక్కిన ముసలి బర్రెను అల్లుడికి తోలించింది.


దాన్ని చూసేసరికి అల్లుడికి అత్త నైజం అర్థమైంది. అయినా చేసేదేమీ లేదుగనక, అతను, అతని భార్యా దాన్నే జాగ్రత్తగా సాక్కొని బ్రతుకు వెళ్ళదీయసాగారు. అనుకున్నట్లుగానే ఆ ముసలి బర్రె ఓరోజున అకస్మాత్తుగా చనిపోయింది. అల్లుడు ఆ బర్రె తాలూకు చర్మాన్ని సిద్ధం చేయించుకొని, పొరుగూరి సంతలో అమ్మేందుకు తీసుకువెళ్ళాడు. కానీ అతని రాతకొద్దీ ఆ చర్మాన్ని కూడా ఎవ్వరూ కొనలేదు. సాయంత్రం వరకూ వేచి చూసి, అల్లుడు ఆ చర్మాన్ని వాపసు తీసుకొని, సొంతఊరికి బయలుదేరాడు. దారి మధ్యలోనే చీకటి పడింది; దానికితోడు చిన్నగా వర్షం మొదలైంది!


చేసేదేమీ లేక, దారి ప్రక్కనే చిన్న పాడుపడిన గుడి కనబడితే, చర్మాన్ని ఆ గుడిపైన పెట్టి, తను ఓమూలగా చీకట్లో నక్కి కూర్చున్నాడు అల్లుడు. అర్థరాత్రి అయ్యింది, వర్షం ఆగిపోయింది. ఆ సమయంలో ఎవరో ముగ్గురు వ్యక్తులు ఒక మూటతో‌ పరుగెత్తుకొని వచ్చి, దాన్ని గుడిలోపలికి గిరాటు వేసారు. అరవబోయిన అల్లుడు 'వాళ్లెవరో'నని నోరు నొక్కుకొని కూర్చున్నాడు. వచ్చిన దొంగలు కూడా ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు దగ్గర్లోనే.


అంతలో వర్షం మళ్ళీ మొదలైంది. దేవాలయం పైన ఉంచిన చర్మం బాగా ఎండి ఉన్నది. పెద్ద పెద్ద వానచినుకులు దాని మీద పడినప్పుడల్లా అది "ఢం ఢం" అని శబ్దం చేస్తున్నది. పరాకున ఉన్న దొంగలు హఠాత్తుగా ఆ శబ్దం విని అది డప్పుల శబ్దమేననుకున్నారు. 'అంటే ఊరి జనాలు ఒక్కటై, డప్పులు వాయించుకుంటూ దేవాలయానికి వస్తున్నారన్న మాట!' అలా అనుకొని వాళ్ళు చేతికందిన సామాన్లు పట్టుకొని పరుగు లంకించుకున్నారు. ఆ హడావిడిలో వాళ్ళ డబ్బు మూట అక్కడే ఉండిపోయింది!


మూలన దాగిఉన్న అల్లుడు వెంటనే ఆ సంచిని తీసుకొని ఇల్లు చేరుకున్నాడు. ప్రశాంతంగా నిద్రపోయి లేచి, తెల్లవారగా తన భార్యను లేపి, వాళ్ళ తల్లిగారింటికి పోయి సేరు తీసుకురమ్మన్నాడు- బంగారు నాణాలు కొలవాలిగద! కూతురు పిచ్చమ్మ ఇంటికి వెళ్ళి సేరు ఇమ్మంది; కానీ, 'ఊరికే అలా సేరు ఇచ్చేస్తే ఎలాగ?' అని పిచ్చమ్మ దాని అడుగుకు కొంచెం చింతపండు అతికించి ఇచ్చింది. అల్లుడు ఆ సేరుతో బంగారు నాణాలు కొలవగా ఒకటి రెండు నాణాలు ఆ చింతపండుకు అతుక్కుపోయాయి. చూసుకోని అల్లుడు పాపం, దాన్ని పిచ్చమ్మకు తిరిగి పంపించాడు.


మరునిముషంలో పిచ్చమ్మ అల్లుని గడపలో ప్రత్యక్షమైంది.. అన్ని డబ్బులు ఎలా వచ్చాయని అడిగేందుకు. "అయ్యో ఏం చెప్పాలత్తా! నువ్విచ్చిన బర్రె చనిపోయిన సంగతి తెలుసుకదా, నీకు? దాని చర్మాన్ని పట్నం సంతలో చిల్లరగా అమ్మానా? చర్మానికి రేటు బాగా ఉందట, ఇన్ని డబ్బులొచ్చాయి" అన్నాడు అల్లుడు గడుసుగా. ఆశపోతు పిచ్చమ్మకు ఊపిరి ఆగలేదు. ఆమె వెంటనే తన వద్ద మిగిలిన బర్రెలన్నింటినీ కసాయికిచ్చేసి, తడి చర్మాలనే పట్నం సంతకు తీసుకెళ్ళింది. ఆనాటి సంతంతా వాటి కంపుతో నిండిపోయింది. జనాలందరూ కూడబలుక్కుని, ఆమెను వాటంగా తిట్టి, సంతనుండి తరిమేశారు. ఉన్న బర్రెలూ ఊడిన పిచ్చమ్మ లబోదిబోమన్నది.

Post a Comment

Comments