Moral Stories: పరివర్తన

 సిరిపురంలో గోవిందుడు అనే యువకుడు చిన్నప్పటినుండే దొంగతనాలకు అలవాటుపడ్డాడు. ఎవరికీ పట్టుబడకుండా ఎంతో ఉపాయంగా దొంగతనాలు చేసేవాడు. వాడిని పట్టుకోవడానికి ఎంతో మంది ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈ విషయం ఆనోటా ఈనోటా ప్రాకి రాజు గారికి తెలిసింది.


రాజు రంగనాధుడు దయార్ద్ర హృదయుడు. ఇలాంటి వారిని ఎంతో మందిని మంచి వారిగా మార్చాడు. రాజు గారికి వీడి విషయం తెలిసిన మరునాడే వాడిని పట్టుకు రమ్మని భటులను పంపాడు. భటులను పంపుతున్న విషయాన్ని ముందుగానే ఆ ఊరి ప్రజలకు, గోవిందుడికీ తెలిసేట్లు చేశాడు.

భటులు ఊళ్ళోకి వచ్చారన్న వార్త విని గోవిందుడు పారిపోసాగాడు. పథకం ప్రకారం రాజభటులు గోవిందుడిని చంద్రగిరి అడవుల్లోకి వెళ్ళేట్లు తరిమి కొట్టారు. "ఆడవిని జాగ్రత్తగా దాటితే నందపురం చేరుకోవచ్చు" అనుకుంటూ వడివడిగా నడవసాగాడు గోవిందుడు.

సాయంత్రం అయింది. చీకట్లు ముసురుకుంటున్నాయి. అలిసిన గోవిందుడు రాత్రికి విశ్రాంతి తీసుకోవడం కోసం ఎత్తైన చెట్టుని ఎక్కబోతుండగా "ఎవరురా నువ్వు?! ఎందుకు, నా చెట్టును ఎక్కుతున్నావు?" అన్న మాటలు వినిపించి భయంగా క్రిందకు చూశాడు. చెట్టు క్రింద ఒక భయంకరాకారుడు నిలబడి ఉన్నాడు.

భయం వల్ల గోవిందుడికి నోట మాట రాలేదు. "భయపడకు. చెట్టు దిగిరా! నేను నిన్నేమీ చేయను" అన్నాడా భయంకరాకారుడు.

గోవిందుడు చెట్టు దిగి వచ్చాడు.


"ఎవరు నువ్వు? ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు?" అడిగాడు ఆ భయంకరాకారుడు.

"నేను ఒక దొంగను. రాజ భటులు నన్ను ఈ అడవిలోకి తరిమారు" అన్నాడు గోవిందుడు వణికిపోతూ.


"భయపడకు. నేను ఒక రాక్షసుడిని. ఎప్పుడూ ఇక్కడే తిరుగుతుంటాను. ఈ చెట్టు నా నివాసం. నేను నీకు కొంత డబ్బు ఇస్తాను. దొంగతనాలు మానేసి వ్యాపారం చేసుకుని బ్రతుకుతావా?" అని అడిగాడు భయంకరాకారం.

"ఇప్పటికే సగం చచ్చి ఉన్నాను. ఇక దొంగతనాలు చేయను. నువ్వు చెప్పినట్లే వ్యాపారం చేసుకుని బ్రతుకుతాను" అన్నాడు గోవిందుడు సంతోషంగా.


భయంకరాకారుడు ఆ చెట్టు తొర్రలోంచి పెద్ద డబ్బు మూట తీసాడు. అందులోంచి కొంత డబ్బుని తీసి గోవిందుడి చేతికి ఇస్తూ "చెట్టెక్కి పడుకుని రేపు ఉదయాన్నే ఇక్కడి నుండి వెళ్ళు" అని మిగిలిన డబ్బు మూటను తిరిగి తొర్రలో ఉంచి, చీకట్లోకి దూకి మాయమయ్యాడు.

భయంకరాకారం తన చేతికి ఇచ్చిన డబ్బు అంత సంతోష పెట్టలేదు గానీ; అతను తిరిగి తొర్రలో పెట్టిన డబ్బు మూటను చూడగానే మటుకు గోవిందుడి కళ్ళు మెరిశాయి. 'మొత్తం డబ్బునీ ఎలా కాజేయాలా' అని అలోచనలతో రాత్రంతా గడిపాడు వాడు. ఉదయాన్నే లేచి 'ఆ తొర్రలో డబ్బు మూట ఉందా లేదా' అని చూడాలనుకున్నాడు; కానీ ధైర్యం చాలక, అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

అట్లా నందపురం చేరిన గోవిందుడు నేరుగా తనకు తెలిసిన ఓ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాడు. తనకు రాక్షసుడు ఇచ్చిన డబ్బునే ఎరవేసి, ఆ రాక్షసుడిని ఆ అడవిలోంచి పారద్రోలమని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ మాంత్రికుడిని తను అంతకు ముందు పడుకున్న చెట్టు వద్దకు తీసుకు వచ్చాడు. మాంత్రికుడు చాలాసేపు ఏవేవో మంత్రాలు చదివి; 'రాక్షసుడిని పారద్రోలానురా! వాడు ఇక నిన్ను పీడించడు" అని చెప్పి డబ్బులు పుచ్చుకుని వెళ్ళిపోయాడు.

మాంత్రికుడు అటు వెళ్ళగానే ఇటు తొర్రలో చేయి పెట్టి డబ్బు మూటను బయటకు తీశాడు గోవిందుడు. సంతోషంతో పరుగు పరుగున ఇంటికి చేరి మూట విప్పాడు. మూటలో నుండి తేళ్ళు, ఎండ్రకాయలు బయటపడి ఇల్లంతా పాకటం మొదలు పెట్టాయి! భయంతో అరుస్తూ ఇంటి బయటకు పరిగెత్తిన గోవిందుడిని వాకిట్లోనే నిలబడి ఉన్న భటులు బంధించి రాజు గారి దగ్గరకు తీసుకువెళ్ళారు.


అప్పటికే పూర్తిగా చచ్చిన గోవిందుడు రాజు గారి కాళ్ళపైన పడి 'రాక్షసుడిని కూడా మోసం చేశాన'ని ఒప్పుకున్నాడు. వాడు పూర్తిగా మారిపోయాడని గ్రహించిన రాజుగారు "వ్యాపారం చేసుకుంటానని డబ్బు తీసుకున్నావు; కానీ డబ్బు మూటను చూడగానే నీ పాత అలవాటుని మానుకోలేకపోయావు. నీలో మార్పు తీసుకు రావాలనే నా మనిషిని రాక్షసుడిలా నటించేట్లు చేశాను. ఇకనైనా ఆ పాడు బుద్ధిని మానుకుని వ్యాపారం చేసుకో" అంటూ కొంత డబ్బుని వాడి చేతిలో ఉంచాడు.

సిగ్గుతోటీ, కృతజ్ఞతతోటీ తల దించుకున్నాడు గోవిందుడు. అటుపైన ఉన్న ఊళ్ళోనే అంగడి పెట్టుకుని మంచి పేరు సంపాదించుకున్నాడు అతను.

Post a Comment

Comments