Telugu Story: మామిడికాయల దొంగమామిడికాయల దొంగ 

 

కోనవలస గ్రామంలో ఉండే రిక్కీ చేసేవన్నీ అల్లరి  పనులే.   చదివేది ఎనిమిదో తరగతి కానీ పదో తరగతి పిల్లాడిలా చురుకుగా కనబడతాడు. సరిగా బడికి వెళ్ళేవాడు కాదు. నడకదారి ప్రక్కనే ఉన్న పొలాల్లో దిగి చెరుకుగడలు, శనక్కాయలు కోసుకుని ఆ చెట్లను పాడుచేసేవాడు. 


 ఆ  తరగతిలో ఆనందు అనే తెలివైన కుర్రాడు ఉన్నాడు. వాడితో స్నేహం చేస్తే    నోట్స్  ఇస్తాడని  రిక్కీకి  ఆలోచన  వచ్చింది. తరువాత రోజు  దొంగతనంగా కోసుకొచ్చిన జామకాయలను ఆనందుకిచ్చి  “ మా తోటలోవి.  తియ్యగా ఉంటాయి. తీసుకో” అన్నాడు.  


  వద్దన్నా వినకుండా వాడి చేతుల్లో కాయలు  పెట్టడంతో తీసుకున్నాడు ఆనందు. 

తరువాత రోజు చెరకు గడలు,   మరో రోజు కందికాయలు  ఇచ్చాడు రిక్కీ.  అలా వారి మధ్య స్నేహం ఏర్పడింది. 


రిక్కీ  బయటకి వెళ్ళేటప్పుడు ఆనందుని రమ్మనడం మొదలుపెట్టాడు. కాదని చెప్పడానికి మొహమాటపడి  వెళ్ళేవాడు ఆనందు. 

అది చూసిన తోటి  విద్యార్థులు ఆనందుతో  “ వాడితో తిరగవద్దు. వాడితో వెళితే  నీకు ప్రమాదం”  అని హెచ్చరించారు. 


 “నేను  మంచివాడిని కాబట్టి  నాకే  నష్టం లేదు. అయితే వాడు బాగుపడతాడు తప్ప నాకు భయం లేదు” అని తేలిగ్గా తీసుకున్నాడు ఆనందు.   


ఒకరోజు  బడి వదిలిన తరువాత రిక్కీ, ఆనందు కలసి ఇంటికి వెళుతుండగా దారి ప్రక్కనున్న మామిడి తోటలోకి వెళదామన్నాడు రిక్కీ. వద్దని చెప్పాడు   ఆనందు.  కానీ వినిపించుకోలేదు రిక్కీ.


 “నీకంత భయమైతే ఇక్కడే ఉండు. నేను  వెళతాను” అని తోటలోకి వెళ్ళాడు రిక్కీ .  


బాగా పెరిగిన మామిడి కాయలు, పళ్లు కోసుకుని పుస్తకాల సంచిలో వేసుకున్నాడు రిక్కీ. 


  రిక్కీకి తెలియని విషయమేమంటే  తోటమాలి కాపలా ఉండి అదంతా చూస్తున్నాడని।.    తోటలోని  కాయల్ని, పండ్లని ఎవరో  కోసుకుపోతున్నారని  బాగా కోపంతో ఉన్నాడు తోటమాలి .  దొంగ దొరికితే గట్టిగా కొట్టి బుద్ధి చెప్పడానికి   మాటు వేసాడు.


రిక్కీ  చెట్టు  ఎక్కిన తరువాత దొంగిలించిన కాయలతో సహా పట్టుకోవాలని వేచి చూసాడు తోటమాలి. మామిడి  కాయల్ని సంచిలో వేసుకున్న రిక్కీని చూసి  దుడ్డుకర్ర పట్టుకుని చెట్టు క్రిందకు వెళ్ళాడు  తోటమాలి.


“ఓ దొంగబ్బాయ్  ! కిందకు దిగు.  నీ పని చెబుతా” అని గట్టిగా అరిచాడు.


తోటమాలిని చూసిన రిక్కీ  క్షణకాలం భయపడ్డాడు. కానీ అతడికది కొత్తేమీ కాదు.  వెంటనే తమాయించుకుని  “ఏం చేస్తావేమిటి? నువ్వు ఒక్కడివి ఉన్నావు . మేము ఇద్దరం వచ్చాము . నిన్ను తన్నేసి వెళ్లినా అడిగే వారు  లేరు” అని తిరిగి దబాయించాడు.


ఆ మాటలకి తోటమాలికి మరింత  కోపం వచ్చింది.  “రెండోవాడు ఎక్కడ?” అని  అడిగాడు.


“  కంచె అవతల ఉన్నాడు. నేను తీసుకు వెళ్లబోయే మామిడి  కాయల కోసం చూస్తున్నాడు” అంటూ ఆనందుని చూపించాడు. 


తోటమాలికి ఆనందు  సరిగా కనబడలేదు. రెండడుగులు ప్రక్కకి వేసి తల తిప్పి అటు చూసాడు తోటమాలి. 


“నిజమే . అక్కడొకడున్నాడు “ అనుకుని రిక్కీ కోసం మళ్లీ చెట్టు మీదకు చూసాడు. అప్పటికే చెట్టు మీద నుండి దూకేసి పారిపోయాడు రిక్కీ. 


తోటమాలికి రోషం పొడుచుకు వచ్చింది.  “కాయలు దొంగతనం చేయడమే కాకుండా నన్ను బెదిరిస్తాడా? “ అనుకుని రిక్కీ  వెంటబడ్డాడు కానీ వాడు దొరకలేదు.


“వాడు పోతే పోయాడు . రెండో వాడిని పట్టుకుంటాను. అప్పుడు వీడు దొరుకుతాడు“ అని ఆనందు వైపు పరిగెత్తాడు  తోటమాలి.


అది చూసి కూడా  తోటమాలి వస్తున్నాడని  ఆనందుకి  చెప్పలేదు రిక్కీ.


తన వైపు   పరుగెత్తి వస్తున్న తోటమాలిని చూసాడు ఆనందు. కానీ   “నేనెందుకు భయపడాలి. నేను దొంగతనం చేయలేదు“ అనుకున్నాడు ధీమాగా.


అలా చూస్తుండగానే దగ్గరికి వచ్చిన తోటమాలి ఆనందు జుట్టుని గట్టిగా   పట్టుకున్నాడు. తల కిందకు ఒంచి వీపు మీద కొట్టడం  మొదలుపెట్టాడు.


“నన్నెందుకు కొడుతున్నావు? నేనేం చేసాను. నీ తోటలోకి కూడ రాలేదు “ అని అడిగిన  ఆనందుకి రెండు చెంపలు వాయించి “నువ్వేం చేసావని అడుగుతున్నావా? సిగ్గు లేదూ?   దొంగతనానికి వచ్చి, వాడిని లోపలికి పంపి నువ్వు బయట కాపలా ఉంటావా? పద.. చెట్టుకు కట్టేస్తాను నిన్ను. రోజూ మీ ఇద్దరూ   కాయలు తెంపి పడేస్తున్నారు. మా యజమాని వచ్చేవరకు వదలను” అన్నాడు   లోపలకి లాక్కెళుతూ. 


“నా మాట నమ్మండి. నేనలాంటివాడిని కాదు “ అని ఆనందు  ఎంత మొత్తుకున్నా తోటమాలి వినిపించుకోకుండా   చెట్టుకు కట్టేసాడు.


ఆ దారి వెంబడి  వెళుతున్న బాటసారులు   చెట్టుకు కట్టేసి  ఉన్న ఆనందుని చూసి….  ఊళ్లోకి వెళ్లి వాళ్ళ అమ్మానాన్నలకు చెప్పారు.  వాళ్లు  వచ్చి ఆనంద్ ని విడిపించారు. అసలు జరిగిందేమిటో  అక్కడివారందరికీ వివరించి     తన  తప్పేం లేదన్నాడు. 


“ చెడ్డ వాడితో స్నేహం చెయ్యడమే  నీ తప్పు. ఇంకా ఏం  చెయ్యాలి”  అని గట్టిగా మందలించారు .


“మిత్రులు హెచ్చరించినా వినకుండా … తెలిసి తెలిసీ రిక్కీతో  స్నేహం చేసాను.  అందుకు నాకు బాగా బుద్ధి వచ్చింది. ఇక నుంచి పొరపాటు చెయ్యను” అంటూ బాధపడ్డాడు  ఆనందు. 

_*__

Post a Comment

Comments