Telugu story: అన్ని విషయాల్లో కృతజ్ఞత చూపుతున్నావా?

 🍁అన్ని విషయాల్లో కృతజ్ఞత చూపుతున్నావా?’’🍁


కోశంబి రాజు ఉదయనుడి దగ్గర భద్రావతి అనే ఏనుగు ఉండేది. అది చాలా బలమైనది, తెలివైనది. యుద్ధరంగంలోకి దూకిందంటే చాలు... శత్రు సేనల్ని తొక్కి మట్టి కరిపించేది. దాని శరీరంలో బాణాలు దిగినా వెనకడుగు వేసేది కాదు. ఉదయనుడు ఎన్నో యుద్ధాలు జయించడంలో భద్రావతిదే కీలక పాత్ర. ఆ సమయంలో దాని బాగోగులను రాజు చాలా జాగ్రత్తగా చూసేవాడు. మంచి ఆహారం పెట్టించేవాడు. బంగారు ఆభరణాలతో అలంకరింపజేసేవాడు.


కొన్నాళ్ళకు భద్రావతి ముసలిదైపోయింది. దానితో ఆ ఏనుగు మీద రాజుకు ఆదరణ తగ్గిపోయింది. దాని పోషణను కూడా మానేశాడు. దాన్ని వదిలేశాడు. అది తిరుగుతూ తిరుగుతూ అడవికి చేరింది. దొరికిన ఆకులూ, అలములూ తింటూ కాలం గడిపేది.


ఒకనాడు బుద్ధుడు తన పరివారంతో అడవి మార్గంలో కోశంబికి వస్తున్నాడు. భద్రావతి దారికి ఎదురు వచ్చి, మోకాళ్ళపై కూర్చొని, దీనంగా అరచింది. కన్నీరు పెట్టుకుంది. బుద్ధుడు దాని నుదుటి మీద తాకి సాంత్వన చేకూర్చాడు తొండాన్ని నిమిరాడు. దాని దీన స్థితి ఆయనకు అర్థమయింది. మౌనంగా ముందుకు కదిలాడు. ఆ రోజు ఉదయనుడి దగ్గరకు వెళ్ళినప్పుడు ‘‘రాజా! అన్ని విషయాల్లో కృతజ్ఞత చూపుతున్నావా?’’ అని అడిగాడు.


‘‘భగవాన్‌! నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుణ్ణే!’’ అన్నాడు రాజు నమస్కరిస్తూ.


‘‘నువ్వు ఈ రోజున మహారాజుగా నిలబడడానికి నీ పరివారం, సైనికులు, సేనాపతులు ఎంత కారణమో భద్రావతీ అంతే కారణం. భద్రావతి వల్లే నువ్వు ఈ రాజ్యాన్ని నిలుపుకోగలిగావు. నీకు నీ రాణి దక్కింది. దాని వీరోచిత కార్యం వల్లే మీకు ప్రాణాలు దక్కాయి. అలాంటి భధ్రావతిని ఒకసారి చూడాలని ఉంది. వెళ్దాం పదండి, మీ గజశాలకు!’’


ఆయన అలా అడగడంతో రాజు కలవరపడ్డాడు- ‘‘భగవాన్‌! భద్రావతి ఇప్పుడు మా గజశాలలో లేదు’’ అన్నాడు బిడియంగా.


‘‘ఎక్కడుంది? ఏమైంది’’


‘‘ముసలిదైపోయింది. మా పోషణలో లేదు. అడవుల్లో తిరుగుతోంది.’’


‘‘రాజా! నీకిది తగునా? మనం మనుషుల పట్లే కాదు, జంతువుల పట్ల కూడా కృతజ్ఞతలు చూపాలి. 


👉న అధికారానికీ, ఐశ్వర్యానికీ, జీవితానికీ మూలమైన భధ్రావతి పట్ల నిరాదరణ కనబరచడం తగునా? 


👉మనకు ఉపయోగపడినప్పుడు ఆదరించడం, ఉపయోగపడలేనప్పుడు నిరాదరణ చూపడం కృతజ్ఞత కాదు. అలాంటి రాజు చిరకాలం సుస్థిరంగా పాలించలేడు. సుఖంగా జీవించలేడు. రాజా!  అని చెప్పాడు బుద్ధుడు. 


👉ఉదయనుడు తప్పు తెలుసుకున్నాడు. పరివారాన్ని పంపి, ఆరోజే అడవి నుంచి భద్రావతిని తిరిగి రప్పించాడు. పూర్వ ఆదరణ చూపాడు.

Post a Comment

Comments