ఒపిఎస్ పునరుద్ధరణ కోసం మహారాష్ట్ర ఉద్యోగుల నిరవధిక సమ్మె

ముంబయి: పాత పెన్షన్ పథకాన్ని (ఒపిఎస్) అమలు చేయాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మంగళవారం నుండి నిరవధిక సమ్మెకు దిగారు. క్లాస్‌ 3, 4 ఉద్యోగులు, బోధనా, బోధనేతర సిబ్బందిలో చాలా మంది విధులకు హాజరు కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్య రంగ సేవలు, పాఠశాలలు, కాలేజీలు స్తంభించాయి. ఉద్యోగుల డిమాండ్‌ను పరిశీలిస్తామంటూనే, సమ్మె చేస్తున్న ఉద్యోగులపై చర్యలు తప్పవంటూ ప్రభుత్వం బెదిరింపులకు దిగింది. 17లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో ఉన్నట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. తమ డిమాండ్లు నెరవేరేవరకు నిరసన, ఆందోళనలు కొనసాగుతాయని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్‌ విశ్వాస్‌ కట్కర్‌ స్పష్టం చేశారు. ఈ నిరవధిక సమ్మెలో జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ కౌన్సిల్‌ ఉద్యోగులు కూడా పాల్గన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంఘీభావంగా మంగళవారం మధ్యాహ్నం అజాద్‌ మైదాన్‌లో బిఎంసి ఉద్యోగులు నిరసన తెలిపారు. పాత పెన్షన్‌ పథకం అమలు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి పాలనాపరమైన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

2005లో మహారాష్ట్ర ప్రభుత్వం ఒపిఎస్‌ అమలును నిలిపివేసి, ఆ స్థానంలో కొత్త పెన్షన్‌ పథకాన్ని తీసుకొచ్చింది. పాత పద్దతిలో కాకుండా, కొత్త పద్దతిలో పెన్షన్‌ మొత్తాన్ని ఉద్యోగుల వేతనాల్లో నుండే మినహాయిస్తారు. పాత పెన్షన్‌ పథకంలో బేసిక్‌ వేతనంలో 50శాతం పెన్షన్‌గా వచ్చేది, కానీ కొత్త పథకంలో ఈ మొత్తం బేసిక్‌ వేతనంలో 25శాతం కూడా వుండదని విశ్వాస్‌ కట్కర్‌ తెలిపారు.

ఉద్యోగుల సమ్మె బిజెపి, శివసేనకి గుబులు పుట్టిస్తోంది. ఒపిఎస్‌పై ఉద్యోగుల అసంతృప్తి వల్లే గత నెలలో మండలిలో రెండు సీట్లకు జరిగిన పోలింగ్‌లో పాలక కూటమి ఓడిపోయిందని భావిస్తున్నారు.

రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ ఒపిఎస్‌ను అమలు చేశాయని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. ఒపిఎస్‌ వల్ల వారి ఆర్ధికవ్యవస్థ దెబ్బతిననపుడు మన ఆర్థిక వ్యవస్థ మాత్రమే ఎందుకు దెబ్బతింటుందని ప్రశ్నించారు. చాలా మంది ప్రభుత్వోద్యోగులు 12ఏళ్ళ తర్వాతే రిటైరవుతారని, రాష్ట్ర ప్రభుత్వం గనక పద్ధతి ప్రకారం వ్యవహరించినట్లైతే, 12ఏళ్ళ సుదీర్ఘ సమయం వుంటుంది కాబట్టి, ఒపిఎస్‌ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు చేయవచ్చని కట్కర్‌ తెలిపారు.


Post a Comment

Comments