చిత్తశుద్ధి లేని దైవచతనేల?

ఒక ఊళ్లో ఓ పండితుడు ఉండేవాడు. ఎప్పుడూ తానే గొప్పవాడినని భావించేవాడు. ఓసారి అతడికి రాజదర్బారుకు అతిథిగా వెళ్లే అవకాశం వచ్చింది. రాజుగారు ఎంతో ఆదరించారు. పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించారు. తన ముందు రుచికరమైన వంటకాలున్నా.. ఆ పండితుడు చాలా మితంగా తిన్నాడు. అంతలోనే పూజ వేళయింది. అందరూ తనును గొప్ప ఆరాధకుడిగా భావించాలని చాలాసేపు పూజ చేశాడు. పూజ పూర్తయ్యాక పండితుడు ఇంటికి వెళ్లాడు. ‘బాగా ఆకలిగా ఉంది అన్నం పెట్టండి’ అన్నాడు. పండితుడి కుమారుడు ‘నాన్నగారూ! మీరు రాజుగారి దర్బారులో తినకుండానే వచ్చేశారా?’ అనడిగాడు. ‘రాజ దర్బారులో తినడానికి ఎన్నున్నా.. కడుపారా తింటే రాజుగారి దృష్టిలో చులకనవుతానేమోనని చాలా తక్కువగా తిన్నాను. కడుపు కాలుతున్నా నా నోటిని అదుపు చేసుకున్నాను’ అని బదులిచ్చాడు.


‘నాన్నగారూ! మీరు పూజ కూడా మళ్లీ చేసుకోండి. ఎందుకంటే.. దర్బారులో చేసిన పూజ దేవుని కోసం చేసుండరు! రాజుగారి మెప్పు కోసం చేసుంటారు’ అని చెప్పడంతో ఆ పండితుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. 


చెల్లని నోట్లతో మనం ఏ వస్తువునూ కొనలేము. అలాగే దేవునికి నచ్చని రీతిలో పుణ్యాలను మూటగట్టుకోలేం. దేవునికి నచ్చని దుర్గుణాలలో ప్రదర్శనా బుద్ధి కూడా ఒకటి. 


పరుల మెప్పుకోసం పాకులాడటం, కీర్తిప్రతిష్ఠల కోసం పనిచేయడం ఇవన్నీ ఒకే కోవకు చెందినవి. 


ప్రదర్శనా బుద్ధితో చేసేది మంచి పనైనా దుర్గుణమే అవుతుంది. 


దేవుని బోధనల ప్రకారం దైవదాసుడు ఎలాంటి సత్‌క్రియలు చేసినా కేవలం దేవుని మెప్పు కోసమే చేయాలి. 


ప్రజలు తన్ను మెచ్చుకోవాలని చేసే ఎంత గొప్ప పనైనా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.🍁

Post a Comment

Comments