ఆది గురువు అమ్మ: బాల్యంలో అందరికీ అమ్మ మాటే వేదం. అమ్మ



బాల్యంలో అందరికీ అమ్మ మాటే వేదం. అమ్మ అంటే దైవం అమ్మలు అందరూ పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. కలకాలం సుఖంగా, సంతోషంగా తన సంతానం గడుపుతూ ఉంటే కళ్లారా చూసి ఆనందించేది అమ్మ. అన్ని ప్రేమలకున్నా తల్లి పేగుబంధం ఒక వీడని అనుబంధమై ఆమెను ఏ త్యాగానికైనా పురిగొల్పుతుంది. బిడ్డల భవిష్యత్తు కోసం తల్లి తన సర్వస్వం ధారపోస్తుంది. భూదేవిలా ఓర్పు వహించి వారిని పెంచి పెద్ద చేస్తుంది. ఉగ్గపడుతూ బిడ్డలను లాలిస్తుంది. గోరుముద్దలు పెడుతూ ముద్దులు కురిపిస్తుంది. ఊయల ఊపి జోలపాడి నిద్రపుచ్చుతుంది. పెద్దవారయ్యాక, బుద్ధిగా హుందాగా మెలగాలని తల్లి కోరుకోవడం, దీవించడం తప్పేమీ కాదు. ఆమె మంచితనమే బిడ్డలకు శ్రీరామరక్ష ఆమె ప్రేమానురాగాలకు సాటి రాగలది పాటి చేయగలది ఈ ప్రపంచంలో మరొకటి లేదు.


లోకంలో కొంతమంది చెడ్డ కొడుకులు ఉండవచ్చు. చెడ్డ తల్లి ఎక్కడా కనిపించదు అన్న అత్త వాక్యం అక్షర సత్యం. ఎంతో ప్రేమతో పెంచిన బిడ్డలు బాధపడినా.. భంగపడినా తల్లి హృదయం తహతహలాడుతుంది. మనసు గిలగిల కొట్టుకుంటుంది. పిల్లల్లో ధనదాహం, పటాటోపం పెరగకుండా ఆదిలోనే జాగ్రత్తపడాలి. పసితనంలో నాటిన ఉత్తమ సంస్కార బీజాలు పెరిగి పెద్దవై వారి జీవితాలను మూడుపూవులు, ఆరుకాయలుగా

తీర్చిదిద్దుతాయి. మంచి మాటలతోపాటు మంచి అలవాట్లు, ఆలోచనలు నేర్పించాలి. అది అమ్మ వల్లే జరగాలి. ముద్దుముద్దుగా మాటలు నేర్పేదీ అమ్మే. ఏ భాషను కలలో కూడా మరవకుండా మనం మాట్లాడగలమో అదే మాతృభాష


చదువు సంస్కారాలు, విద్య వినయాలు జంటపదాలు. సంస్కారం నేర్పని చదువు, వినయం లేని విద్య, తావి లేని పువ్వు అడవికాచిన వెన్నెల లాంటివి. చిన్నప్పుడు పక్కన పడుకోబెట్టుకుని అమ్మ చెప్పే నీతి కథలు విజ్ఞాన వినోదాలతో కూడిన జీవిత పాఠాలు. అవి విలువైనవి. జీవితానికి అన్వయించుకోదగినవి. గతానికి, భవితకు ప్రస్తుతం కదిలే ఒక వంతెన లాంటిది చెడును తలచుకుంటూ గతంలోని బంగారు కలలు ఊహించుకుంటూ భవిష్యత్తులో కూర్చోకూడదు. రెండింటి నడుమ సతమతం కాకూడదు. ప్రస్తుతంలో జీవిస్తూ, గతంలోని మంచి ఆలోచనలను ఆహ్వానించాలి. వీలైతే వాటి ద్వారా మంచిని పెంచే పనులూ చేపట్టాలి. అందుకు కావలసిన నేపథ్యం కూర్చడం అమ్మకు మాత్రమే సాధ్యం. ఆమె అన్నింటికీ మూలం, ఆధారం. బతుకునిచ్చిన అమ్మ బతుకు పండించుకోవడానికి దారి చూపే దేవత. విద్యాబుద్దుల వెలుగునిచ్చే దారిదీపం.


విద్య రెండు రకాలు, బతుకు తెరువు కోసం లౌకిక విద్య నేర్వాలి. ఎదగడానికి ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవాలి. జీవితాన్ని ఆహ్లాదంగా, ఆనందంగా అనుభవించాలి. ఆదర్శవంతమైన ఉత్తమ జీవితాన్ని వ్యక్తిత్వాన్ని సమాజం ఆదరిస్తుంది. లోకం హర్షిస్తుంది. కర్పూర నీరాజనాలు అర్పించి, ఘనంగా స్వాగతిస్తుంది. పదిమందికి మేలు చేస్తూ తన మేలుకోసం పాటుపడటమే ఆదర్శ మానవ జీవితం. అదే ఆనందయోగం, యోగం జీవితంలో ఒక భాగం అనుకుంటే అది దినచర్యగా మారి కొన్నాళ్లకు చప్పబడుతుంది. జీవితమే ఒక యోగమైతే ప్రతి చర్యా ఒక నిష్కామ కర్మ అవుతుంది. గీత బోధించే కర్మకౌశలాన్ని జనక మహారాజు లాంటివారు చేసి చూపించారు. సతీమదాలస అడ్డాలలోనే బిడ్డలకు లాలిపాటలో వేదాంతం రంగరించి, వైరాగ్యం బోధించింది. రాజ్యాన్ని, రాచరికాన్ని కాలదన్ని వారు మహర్షులయ్యారు. తల్లులందరూ తమ కన్నబిడ్డలను మహర్షులుగా మార్చవలసిన పని లేదు. మంచిమనిషిగా తీర్చిదిద్దితే చాలు

Post a Comment

Comments