12 కోట్ల లాటరీ డబ్బు అతని సంసారంలో చిచ్చు పెట్టింది


చైనాకు చెందిన ఓ వ్యక్తిని అదృష్టం వరించి రూ.12.13 కోట్ల (10 మిలియన్ యువాన్లు) లాటరీ తగిలింది. ఇంత డబ్బు ఒక్కసారిగా రావడంతో అతను ఆనందపరవశంలో మునిగిపోయాడు. అయితే భార్య మాత్రం అతనికి దిమ్మతిరిగే షాకిచ్చింది. తనకు అన్యాయం జరిగిందని, విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది. అంతేకాదు లాటరీ డబ్బుతో పాటు, ఆస్తులను చెరి సమానంగా పంచాలని కోరింది. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలిస్తే మీరు కూడా ఆమెకే మద్దతుగా నిలుస్తారు. వీరి కథేంటో ఇప్పుడు చూద్దాం..

రూ.12 కోట్ల లాటరీ గెలుచుకున్న ఈ వ్యక్తి పేరు జోవ్. ట్యాక్స్ కట్ చేసుకోగా అతనికి రూ.10.22 కోట్లు వచ్చాయి. అయితే ఇంత డబ్బు వచ్చిన విషయం భార్యకు తెలియకుండా దాచాడు. ఈ డుబ్బులో కొంత తన సోదరికి ఇచ్చాడు. అంతే కాదు రూ.85 లక్షలు డ్రా చేసి తన మాజీ ప్రేయసి కోసం మంచి ఫ్లాట్‌ను కొని బహుమతిగా ఇచ్చాడు.

కొన్నాళ్ల తర్వాత జోవ్ భార్య లిన్‌కు ఈ విషయాలు తెలిశాయి. ఇన్ని కోట్ల డబ్బు గెలుచుకున్నా తనకు చెప్పలేదని ఆమె ఆగ్రహంతో రగిలిపోయింది. అతను కొంత డబ్బును సోదరికి ఇవ్వడంతో పాటు, ప్రేయసికి ఫ్లాట్ కొనివ్వడం ఆమెకు మరింత కోపం తెప్పించాయి. దీంతో తనకు ఇంత అన్యాయం చేసిన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని లిన్ కోర్టును ఆశ్రయించింది. లాటరీ డబ్బుతో పాటు మొత్తం ఆస్తిని సమానంగా పంచాలని కోరింది.

కోర్టు కీలక తీర్పు..
వాదనలు విన్న న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. లాటరీ టికెట్‌ను ఇద్దరి డబ్బుతోనే కొన్నప్పటికీ.. జోవ్ రూ.12 కోట్లు గెల్చుకున్న విషయాన్ని భార్య దగ్గర దాచడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. అతని సోదరి, ప్రియురాలి కోసం ఖర్చు చేసిన డబ్బు కూడా లాటరీలో గెల్చుకున్నదే అని గుర్తించింది. దీంతో రూ.12.13 కోట్లలో 60 శాతం డబ్బును(రూ.7.29కోట్లు) భార్యకు చెల్లించాలని ఆదేశించింది. మిగతా ఆస్తిని చెరి సమానంగా పంచింది. ఇందుకు సంబంధించి చైనా మీడియాలో వచ్చిన కథనం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.  భర్త తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు.

చైనాలో గతేడాది కూడా ఇలాంటి ఘటన జరిగింది. లాటరీలో ఏకంగా రూ.248 కోట్లు గెలుచుకున్న ఓ వ్యక్తి ఆ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియకుండా దాచాడు. ఇంత డబ్బు ఉందని తెలిస్తే వారు ఏ పని చేయకుండా సోమరిపోతుల్లా తయారవుతారని, కష్టపడరనే భయంతో అతను ఇలా చేశాడు.

Post a Comment

Comments