భరణం కోసం భార్య వేధింపులు.. కిడ్నీ అమ్మకానికి పెట్టిన భర్త

 అదనపు కట్నం కోసం భార్యల్ని భర్తలు వేధించే ఘటనలు తరచూ వెలుగుచూస్తూనే ఉంటాయి. కానీ.. భరణం కోసం భర్తను భార్య వేధిస్తున్న సంఘటన తాజాగా వెలుగుచూసింది. చివరికి కిడ్నీ అమ్మేందుకు కూడా ఆ వ్యక్తి సిద్ధమయ్యాడంటే.. ఏ స్థాయిలో అత్తింటివారి నుంచి అతనికి వేధింపులు ఎదురవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ నిర్దిష్ట సమయానికల్లా తనకు డబ్బులు అందకపోతే.. ఆత్మహత్య చేసుకోవడానికి కూడా రెడీ అయ్యాడు. రెండు వైపులా ఈ వివరాలున్న బ్యానర్‌ను చేత పట్టుకొని.. ఆ వ్యక్తి రోడ్లు, వీధుల్లో తిరుగుతున్నాడు. హరిణాయాలోని ఫరిదాబాద్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..

బిహార్‌ రాజధాని పట్నాకు చెందిన సంజీవ్‌కు ఆరేళ్ల క్రితం ఓ మహిళతో వివాహం అయ్యింది. తొలుత వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది కానీ, కొన్ని రోజుల తర్వాత అతనికి కష్టాలు మొదలయ్యాయి. భార్య, బావమరిది, అత్తమామలు అతడ్ని వేధించడం మొదలుపెట్టారు. రోజురోజుకు ఆ వేధింపులు పెరుగుతూ వచ్చాయే తప్ప, తగ్గలేదు. దీంతో మనశ్శాంతి కరువై అతడు నానాతంటాలు పడ్డాడు. చివరికి భార్యను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే.. విడాకులు ఇవ్వాలంటే రూ.10 లక్షలు భరణం ఇవ్వాల్సిందేనని భార్య, అత్తింటివారు డిమాండ్ పెట్టారు. తన వద్ద అంత డబ్బు లేదని, కొంత మొత్తం వరకు సర్దుబాటు చేయగలనని వేడుకున్నా.. వాళ్లు వినలేదు. పోలీసులు, అధికారుల సహాయం కూడా అనేకసార్లు కోరాడు. కానీ.. ఎవ్వరూ అతనికి మద్దతుగా ముందుకు రాలేదు.

దీంతో విసుగెత్తిపోయిన సంజీవ్.. ‘‘భార్యకు భరణం ఇచ్చేందుకు డబ్బులు లేవు, అందుకోసం కిడ్నీ అమ్మడానికి సిద్ధంగా ఉన్నా’’ అనే బ్యానర్ పట్టుకుని తిరగడం స్టార్ట్ చేశాడు. ఆ బ్యానర్‌లో అత్తింటివారి ఫోటోలను కూడా పొందుపరిచాడు. ఒకవేళ ఫిబ్రవరి 21వ తేదీలోగా కిడ్నీ విక్రయించకపోతే.. 21న ఆత్మహుతి కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నాడు. ఆ కార్యక్రమానికి హాజరు కావాలంటూ.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ పేర్లను ముద్రించాడు. పెళ్లైన నాలుగు నెలలకే భార్య గర్భం దాల్చినప్పుడు.. అత్తింటివారు బలవంతంగా అబార్షన్ చేయించారని వాపోయాడు కూడా!

Leave a Comment