ఓటు హక్కుతో ప్రైవేటు టీచర్లు సంఘటితం | ఓటుహక్కు కూడా యాజమాన్యాల దాక్షిణ్యమేనా

ఓటు హక్కుతో ప్రైవేటు టీచర్లు సంఘటితం వీరికెలాంటి పారదర్శక నియామక విధానం వుండదు.                          

 👉ఏడాదిలో 10 నెలలకు మించి జీతాలుండవు.                              

 👉అవీ అన్ని సబ్జెక్టుల వారికీ ఒకే రకంగా వుండవు.

 👉పాఠశాలల్లో పాతికవేలు, కళాశాలల్లో యాభైవేలు జీతం తీసుకొనే ”మహర్జాతకులు” పదిశాతం కూడా వుండరు. 

 👉ప్రభుత్వ కాంట్రాక్టు టీచర్లు వీరి కంటే వందరెట్లు నయం. 

👉కొన్ని సబ్జెక్టుల టీచర్లకు మూడు నెలలకు మించి పని వుండదు, తర్వాత పిల్లల కోసం ఇల్లిల్లూ తిరగడమే వీరి పని.                                       

👉ఎప్పుడైనా తీసెయ్యవచ్చు.                         

👉ఏ సెలవులూ వుండవు. 

👉ఇక ప్రశ్నించడమనేది ఊహకయినా అందని విషయం.                              

👉కరోనా కాలంలో భిక్షమెత్తుకున్న వారూ ఉన్నారంటే వీరిదెంత దయనీయ స్థితో మనం అర్ధం చేసుకోవచ్చు.


శాసనమండలి ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేశాయి. అనూహ్యంగా ఈ సారి ప్రైవేటు ఉపాధ్యాయులు వీటిలో కీలక పాత్ర పోషించబోతున్నారు. ఎన్నికలు జరుగుతున్న  రెండు ఉపాధ్యాయ నియోజక వర్గాల్లో దాదాపు 35శాతం ఓట్లు వీరివే కావడం మన రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి.దీన్ని మనందరం ఆహ్వానించి తీరాలి. అలహాబాద్‌ హైకోర్టు తీర్పు అరకొరగానే అమలు

అలహాబాద్‌ హైకోర్టు 2006లో ప్రైవేటు టీచర్లకు ఓటుహక్కు కల్పించాక, జివో.ఎం.ఎస్‌.537 తేదీ 2006 సెప్టెంబర్‌ 28న ఎన్నికల కమిషన్‌ దీనికనుగుణంగా ఉత్తర్వులివ్వడంతో ఈ కొత్త శకం మొదలైన బాలారిష్టాలు దాటడం అంత సులభంగా ఏమీ జరగలేదు.             

గుర్తింపు పొందిన హైస్కూల్లో కనీసం 3ఏళ్ల సర్వీసు ఉండాలని,ఇపియఫ్‌ తప్పనిసరి అనీ, హెడ్‌మాస్టరు సంతకంపై సంబంధిత జిల్లా, ప్రాంతీయ అధికారి లేదా రిజిస్ట్రారు కౌంటరు సంతకం చెయ్యాలనీ ఎన్నికల కమిషన్‌ నిర్దేశించడంతో ఇప్పటికీ వీరి ఓటుహక్కు అరకొరగానే అమలవుతోంది.

అసలు సమస్య ఏ వివరాలూ లేకపోవడం 

ప్రభుత్వం వద్ద ప్రైవేటు టీచర్ల ఖచ్చితమైన వివరాలు ఇంత సాంకేతిక విజ్ఞానం విస్తరించిన రోజుల్లో కూడా ఏవీ లేకపోవడం విద్యాశాఖ నిర్లక్ష్యానికి, చేతగానితనానికి గొప్ప నిదర్శనం దాదాపు      45 శాతం పాఠశాలల విద్యార్ధులకు, 80 శాతం పైగా ఉన్నత, సాంకేతిక విద్యల విద్యార్ధులకు విద్యనేర్పుతూ రాష్ట్ర విద్యారంగంలో ఒక గొప్ప పాత్ర పోషిస్తున్న ఈ టీచర్ల అధికారిక వివరాలు విద్యాశాఖ వద్ద లేకపోవడమేమిటి.

  జ్ఞానభూమి, డైస్‌ లాంటి అధికార పోర్టల్స్‌లో వున్న ప్రైవేటు టీచర్ల వివరాలన్నీ తప్పుల తడకలు. వీటిలో నిజంగా పనిచేస్తున్న వారు సగం మంది కూడా వుండరు. అంతా యాజమాన్యాల దయాదాక్షిణ్యం. ఇక  ఇపియఫ్‌ 10శాతం టీచర్లకు కూడా అమల్లో లేదు.ఈ మధ్య జీతం 15వేలు దాటితే ఇపియఫ్‌ అవసరం లేదన్న కుతర్కాన్ని ముందుకు తేవడం మరీ విచిత్రం. నిజానికీ నిబంధన ఇపియఫ్ కాంట్రిబ్యూషన్‌కు సంబంధించింది. ఒకవేళ దీన్ని వర్తింపజేస్తే తమ బంధువుల కిద్దరికో, ముగ్గురికో చెల్లించి సరిపెడుతున్నారు. కొంతకాలం ఇంజనీరింగ్‌ కాలేజీలు ఈ విషయంలో మెరుగ్గా వుండేవి. ఇప్పుడవీ ప్రావిడెంటు ఫండుకు దూరంగా వుండిపొయ్యాయి. ఇక టీచర్లకు జీతాలు ఆన్‌లైన్‌లో చెల్లించరు. వీటికేమీ రికార్డులు వుండవు. చివరకు హాజరుపట్టికలో వుండే పేర్లకూ, పనిచేస్తున్న వారి పేర్లకూ, విద్యాశాఖ పోర్టల్స్‌లో వున్న పేర్లకూ ఏ పొంతనా వుండదు. ఈ తతంగమంతా విద్యాశాఖ కనుసన్నల్లోనే జరుగుతుండంతో పాపం ప్రైవేటు టీచర్లు ఏ అధికార రికార్డుల్లోలేని అనాథలుగా మిగులుతున్నారు. దీంతో వీరికి ఓటుహక్కు లభించడం అంతా యాజమాన్యాల కరుణా కటాక్షాల మీదా, విద్యాశాఖ అధికారుల్ని ప్రసన్నం చేసుకోవడం మీదా ఆధారపడి వుంటోంది.

                                                 

ఓటుహక్కు కూడా యాజమాన్యాల దాక్షిణ్యమేనా 

నిజానికి ఒక ప్రైవేటు టీచరు స్వయంగా ఓటరుగా నమోదయ్యే అవకాశం ఏ మాత్రమూ లేదు.దీనికి యజమాని సంతకం లభించదు. విద్యాశాఖాధికారి దగ్గరికి వెళ్లే శక్తి అతనికి ఉండదు. అందువల్ల యజమానులు కోరుకున్న వారే ఓటర్లవుతారు. వారే దరఖాస్తులు సేకరించి, తమ ”శక్తియుక్తులతో” సంతకాలు చేయించి ఓటర్లుగా నమోదుచేస్తారు.ఇందులో టీచర్ల ప్రమేయం ఏమీ వుండదు. దీనివల్ల నిజమైన టీచర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. మౌన ప్రేక్షకులుగా మిగిలిపోవాల్సి వస్తోంది. ఖచ్చితమైన రికార్డులు సర్వీసుతో సహా వుండివుంటే, వాటిని ఆధికారికంగా వెబ్‌సైట్‌లో బహిరంగ పరచి వుంటే వారంతా అర్హులైన ఓటర్లయివుండేవారు. ఒక హక్కుగా ఆ రికార్డుల్లోని టీచర్లందరూ ఓటర్లయ్యేవారు. ప్రభుత్వ టీచర్ల వివరాలు పక్కాగా వుండబట్టే నమోదు సమస్య వాళ్ళ చేతుల్ని దాటి పోవడం లేదు. ఓటరుగా నమోదు కావడం కూడా పరాధీనం కావడం ప్రైవేటు టీచర్ల విషయంలో పెద్ద విషాదం.

ఇక బోగస్‌ ఓటర్లు చేర్చడానికి కూడా ఈ రికార్డులు లేక పోవడమే కారణం. ఎన్నికల కమిషన్‌ కూడా ఉదారంగా ఏ రికార్డూ అవసరం లేదన్నట్టు, విద్యాశాఖాధికారి ”సంతృప్తి” చెందితే చాలన్నట్టు, ఇపియఫ్‌ ఐచ్చికమంటూ సడలింపులు ఇచ్చాక అంతా అక్రమాల మయంగా మారింది. ఒకానొక స్కూల్లో 14 మంది టీచర్లు ఉంటే ఏకంగా 76 మంది ఓటర్ల జాబితాలోకి ఎక్కడం దీనికి పరాకాష్ట  విద్యాశాఖాధికారులు అభ్యర్ధుల చేతిలో కీలుబొమ్మలు, కాదంటే వారికి శంకరగిరి మాన్యాలు తప్పవు. అసలు వారి సంతకాలే లేకున్నా, ఫోర్జరీలు చేసినా మన ఎన్నికల కమిషన్‌ అన్నిటినీ చెల్లుబాటు చేస్తుంది  ఫిర్యాదులు చేస్తే జిల్లా అధికారులు వాటిని బుట్టదాఖలు చేస్తారు. ప్రైవేటు టీచర్లకు ఎంతో గౌరవంతో న్యాయస్థానం కల్పించిన ఓటు హక్కును ఇలా బడా యజమానులు, రాజకీయపార్టీలూ కలిసి అపహాస్యం పాలు చేశాయి. మరీ విషాదమేమంటే ఈ ఫోర్జరీలు చేశారని ప్రైవేటు టీచర్లపై కేసులు నమోదు చెయ్యడం కూడా మొదలైంది.* *దీనికి తోడు ఓటరుగా నమోదయితే రేషన్‌కార్డు కూడా గల్లంతవుదన్న భయం కూడా జోడైంది ఇలా ఓటు లభించడం అడుగడుగునా గండంగా మారింది.

ఇక ఓటు హక్కును అభ్యర్ధే ”ప్రసాదించాక”, యజమానులే కథ అంతా నడిపిస్తున్నాక.. వారిని కాదని ప్రైవేటు టీచర్లు ఎలా స్వేచ్ఛగా ఓటెయ్యగలుగుతారుఅసలా పోలింగ్‌ రోజు ఏ సెలవూ ఇవ్వకపోతేనో, ఏ ఆంక్షలో పెడితేనో ఏమవుతుంది అలహాబాద్‌ హైకోర్టు తీర్పు గంగార్పణం అవుతుంది.                                            

బండచాకిరీ – నిలువుదోపిడి

నిజానికి ప్రైవేటు టీచర్లు నష్టజాతకుల్లోకెల్లా నష్ట జాతకులు. వీరికెలాంటి పారదర్శక నియామక విధానం వుండదు. ఏడాదిలో 10 నెలలకు మించి జీతాలుండవు. అవీ అన్ని సబ్జెక్టుల వారికీ ఒకే రకంగా వుండవు. పాఠశాలల్లో పాతికవేలు, కళాశాలల్లో యాభైవేలు జీతం తీసుకొనే ”మహర్జాతకులు” పదిశాతం కూడా వుండరు. ప్రభుత్వ కాంట్రాక్టు టీచర్లు వీరి కంటే వందరెట్లు నయం. కొన్ని సబ్జెక్టుల టీచర్లకు మూడు నెలలకు మించి పని వుండదు, తర్వాత పిల్లల కోసం ఇల్లిల్లూ తిరగడమే వీరి పని. ఎప్పుడైనా తీసెయ్యవచ్చు. ఏ సెలవులూ వుండవు. ఇక ప్రశ్నించడమనేది ఊహకయినా అందని విషయం. కరోనా కాలంలో భిక్షమెత్తుకున్న వారూ ఉన్నారంటే వీరిదెంత దయనీయ స్థితో మనం అర్ధం చేసుకోవచ్చు. దాదాపు 2 లక్షలకు పైగా వున్నా, వీరి శ్రమతో 7000-8000 కోట్ల ‘వ్యాపారం’ జరుగుతున్నా, ఉన్నత మధ్యతరగతి వర్గాలతోపాటు ప్రభుత్వ ఉపాధ్యాయలు సైతం తమ పిల్లలందరినీ వీరి వద్దనే చదివిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోని వర్గమిది. ఈ మధ్య ప్రైవేట్‌ కార్పొరేట్‌ యజమానులు రాజకీయాల్నీ శాసించడం మొదలయ్యాక ఓటర్లను చేర్చడం నుంచి, వారికి తాయిలాలు పంచడం దాకా వీరి విధుల్లో సహజభాగమై పోయింది. అన్నిటికీ మించి వారికెలాంటి సంఘం లేకపోవడం, వీరు సంఘటిత పడే ఏ అవకాశం లేకపోవడమూ వీరిని మరీ ఒంటరి వాళ్లని చేస్తోంది.

         

ప్రైవేటు స్కూళ్ల ఫీజుల్లో 65 శాతం ఉపాధ్యాయుల జీతాలకు ఫియఫ్‌కు దక్కాలని జివో నెంబరు 1 చెపుతోంది. వీరి పేర్ల వివరాలు విద్యాశాఖకు ప్రతి సంవత్సరం అప్‌డేట్‌ చేసి అందించాలని నిబంధనలు చెపుతున్నాయి. ఇక ఇపియఫ్‌, ఇపియస్‌ అనేవి కార్మికులు పోరాడి సాధించుకొన్న హక్కులు. న్యాయంగా కార్మిక వర్గానికి వర్తించే హక్కులన్నీ చట్టం ప్రకారం వీరికీ వర్తించాలి. కానీ అన్నిటికీ వీరు మినహాయింపు కావడం ఆశ్చర్యమేస్తోంది.

                                                        

పిడియఫ్‌ గొంతు తోడయ్యాక…

కానీ చరిత్ర ఎప్పుడూ ఒకేలా వుండదు. శాసనమండలిలో పిడియఫ్‌ ప్రవేశించాక వీరిని సంఘటిత పరచడానికి పలు ప్రయత్నాలు చేసింది. గుడివాడ, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కర్నూలు లాంటి జిల్లాల్లో ప్రైవేటు టీచర్ల సంఘాలు ఏర్పడ్డాయి.

వీటన్నిటినీ ఒక తాటి మీదకి తెచ్చేందుకు విజయవాడలో పెద్ద సమావేశం నిర్వహిం చాం. సామాజిక మాధ్యమాలూ దీనికి బాగా తోడ్పడ్డాయి. ఈ దశలో శాసనమండలిలో ప్రైవేటు టీచర్ల సమస్యలపై………………………                              

పిడియఫ్‌ 2018 ఏప్రిల్‌ 4న జరిపిన చర్చ ఒక గొప్ప మలుపు. దీంతో ప్రభుత్వం పరిష్కరించాల్సిన కొన్ని ఉమ్మడి డిమాండ్లు చట్టసభల్లో సుదీర్ఘ చర్చకు నోచుకు న్నాయి.

మొదటి అంశం– వీరికి ఒక గుర్తింపు కావాలి. వీరందరి వివరాలు అధికారికంగా ఆయాశాఖలు గుర్తించి వెబ్‌సైట్‌లో వుంచాలి. ప్రతి ప్రైవేటు ఉపాధ్యాయుడికీ, ఉద్యోగికీ ఒక గుర్తింపు కార్డును ప్రభుత్వమే ఇవ్వాలి. రెండు- వీరిని సామాజిక భద్రతా చట్రంలోకి తీసుకురావాలి. వీరి కోసం ప్రభుత్వ, యాజమాన్యాల వాటాలతో ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చెయ్యాలి. కష్టకాలం వచ్చినపుడు వారి నిధి ఆదుకునేలా వుండాలి. మూడు-హెల్త్‌కార్డులివ్వాలి. దీని ప్రీమియాన్ని యాజమాన్యాలు చెల్లించాలి. నాలుగు- ఇపియఫ్‌ తప్పని సరిచేసి ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీముకు దీన్ని అనుసంధానించాలి. దీని వల్ల కొంత పెన్షన్‌ కూడా లభిస్తుంది. అయిదు- జివో.యం.యస్‌.1 అమలు చేసి 65 శాతం ఆదాయాన్ని వీరి వేతనాలకు కెేటాయించాలి. ఆరు- కార్మిక హక్కులన్నీ వీరికి వర్తింపజెయ్యాలి.

                                                            

రోజులు మారుతున్నాయి 

వీటిచుట్టూ మెల్లగానే అయినా, రాష్ట్ర స్థాయిలో కాకపోయినా గత కొంత కాలంగా ఎక్కడికక్కడ ప్రైవేటు టీచర్లు సంఘటిత పడసాగారు. స్థానిక సమస్యల్ని కూడా జోడించుకున్నారు. సామాజిక మాధ్యమాల్ని బాగా వాడుకోసాగారు. క్రమంగా వీరు ఏదొక మేరకు డిమాండ్‌ చేసే స్థితికి అక్కడక్కడా చేరుకున్నారు. మంచి టీచర్ల అవసరం కూడా పెరగడంతో వీరు గట్టిగా బేరసారాలు చేసే రోజులు కూడా వస్తున్నాయి. చీటికి మాటికి తీసెయ్యడం. వేధించడం కొంత మేరకయినా తగ్గుతోంది. కొన్ని మంచి యాజమాన్యాలు వీరికి తోడ్పాటునందించడం కూడా విశేషం. అయినా ఇదంతా తొలిదశలోనే వుందని మాత్రం మరిచిపోకూడదు.

         

ప్రైవేటు టీచర్లుగా చేరే వారు ఎక్కువ మంది డియస్సీ కోసం ఎదురు చూస్తుంటారు. తమ బోధనానుభవంతో మంచి ర్యాంకులు సాధిస్తారు కూడా. కానీ ప్రస్తుత ప్రభుత్వం వేలాది పోస్టుల్ని రద్దుచేసి, బడుల్ని విలీనం చేసి డియస్సీకి మంగళం పాడడం వీరి పాలిట అశనిపాతంగా మారింది.

                                                        

చిన్న స్కూళ్లు సతమతం

దీనికి తోడు రాష్ట్రప్రభుత్వం యాజమాన్యాలపై వేధింపులకూ పూనుకుంది. ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు కోతలు పెట్టింది. దాన్ని అమ్మల ఖాతోల్లో వేస్తోంది. గుర్తింపు రెన్యువల్‌ గడువును బాగా తగ్గించింది. ఫైర్‌ సర్టిఫికేట్ల కోసం లక్షలాది సొమ్ము ఖర్చు చెయ్యాల్సిన దుస్థితిని తెచ్చింది. కరోనాతో ప్రైవేటు విద్యాసంస్థలు చిన్న చిన్నవన్నీ నీరసపడిపొయ్యాయి.కార్పొరేట్‌ సంస్థలు మాత్రం కళ కళ లాడుతున్నాయి. ప్రైవేటు విద్య పట్ల, విద్యాసంస్థల మంజూరు పట్ల, వాటి సమస్య పట్ల ప్రభుత్వానికి కనీస బాధ్యత లేకపోడం బాధాకరం. ఇంతటి విస్తృత కీలక వ్యవస్థను మార్కెట్‌కు వదిలేసి ఏ రక్షణా కల్పించకుండా చోద్యం చూస్తుండటం సమస్యల్లోకెల్లా పెద్దసమస్య. ఫలితంగా వీటిలోని టీచర్లు కూడా వీధిన పడుతున్నారు.

 కొత్త చరిత్రకు శ్రీకారం

ఇప్పుడు ప్రైవేటు టీచర్లను ఓటర్ల జాబితాలోకి యాజమాన్యాలు పోటా పోటీగా చేర్చాయి. మరి వీరి స్థితిగతులపై పెద్ద చర్చ ఇప్పుడైనా జరగాలి గదా  కొన్ని డిమాండ్లు స్పష్టంగా ముందుకు రావాలి కదా  అభ్యర్ధులందరూ ఒకరికి మించిన హామీలు ఒకరు ఇవ్వాలి కదా కానీ ఆ ధోరణి ఏమీ కన్పించడం లేదు. పాలక పార్టీనే ఈ ఎన్నికల్ని కబ్జా చేసి, నానా తప్పుడు చేష్టలకూ పాల్పడి, బడా యజమానుల్ని టీచర్ల ఎమ్మెల్సీలుగా పోటీపెట్టి ”ఓ ప్రైవేటు టీచర్లలారా  మీరంతా మా పల్లకీ మొయ్యండి  మమ్ముల్ని అందలాలు లెక్కించండి”* *అంటోంది. ప్రలోభాలు పెడుతోంది. తాయిలాలు పంచుతోంది.మరి ఓటు హక్కుతో నైనా ప్రైవేటు టీచర్లు ఒకతాటిపైకి వస్తారా.ఇప్పుడైనా వీరి స్థితిగతులు బలంగా చర్చ కొస్తాయా. ఇన్నాళ్లూ వీరిని అణచి పెట్టిన వారే వీరి ఓట్లతో అందలా లెక్కాలా వీరిని నడిపించగల, వీరి గొంతు విన్పించగల, వీరిని సంఘటితం చెయ్యగల సహజమిత్రుల్ని వీరు ఎన్నుకొంటారా.

ఈ ప్రశ్నలకు ”మేమేమీ అమాయకులం కాదు”అనే సమాధానం ఈ ఎన్నికల్లో విన్పించే సూచనలు మొదటిసారిగా స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఇది శుభ పరిణామం కొత్త చరిత్రకు శ్రీకారం.

Leave a Comment